Narendra Modi: దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనందరికీ స్ఫూర్తిప్రదాత: ప్రధాని మోదీ
- భారత్ ఇప్పుడు స్వావలంబన సాధిస్తోంది
- సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పని చేస్తోంది
- దేశ రక్షణ వ్యవస్థలో ఇప్పుడు మేడిన్ ఇండియా ఆయుధాలు
- తేజస్ వంటి యుద్ధ విమానాలను చూస్తున్నాం
భారత్ స్వావలంబన సాధిస్తోందని, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పని చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ నాయకుడు దివంగత దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సమర్పన్ దివాస్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... దేశ రక్షణ వ్యవస్థలో ఇప్పుడు మేడిన్ ఇండియా ఆయుధాలు, తేజస్ వంటి యుద్ధ విమానాలను చూస్తున్నామని చెప్పారు.
1965లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో ఆయుధాల విషయంలో విదేశాలపై భారత్ ఆధారపడిందని గుర్తుచేశారు. వ్యవసాయంలోనే కాకుండా రక్షణ రంగంలోనూ స్వావలంబన సాధించాలని ఆ సమయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారని మోదీ తెలిపారు. జాతీయ విధానాన్ని పాటిస్తూ దేశం సాధికారత సాధించేలా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
తాము రాజకీయాల్లో ఏకాభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ప్రభుత్వం మెజార్టీతో నడవచ్చని, దేశం మాత్రం ఏకాభిప్రాయంతో నడవాలని తాను పార్లమెంటులో చెప్పానని గుర్తు చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలు ఆధునిక భారతావనికీ సంబంధించినవిగా ఉంటాయని చెప్పారు. ఆయన మనందరికీ స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సూత్రాల ఆధారంగానే దేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు.