Poultry: బర్డ్ ఫ్లూ భయం.. తెలంగాణ పౌల్ట్రీకి రూ.250 కోట్ల నష్టం!
- దేశవ్యాప్తంగా రూ.3,400 కోట్ల మేర నష్టపోయిన పరిశ్రమ నిర్వాహకులు
- రాజస్థాన్, మహారాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలో తక్కువే అంటున్న నిపుణులు
- రిటైల్ వ్యాపారులు లాభపడ్డారంటున్న పరిశ్రమ వర్గాలు
- చికెన్ ధరలను వ్యాపారులు తగ్గించట్లేదని వెల్లడి
బర్డ్ ఫ్లూ భయం.. తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు నష్టాలను మోసుకొచ్చింది. బర్డ్ ఫ్లూ వస్తుందన్న భయంతో చాలా మంది చికెన్ వైపు చూడడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర తక్కువే అయినా.. పౌల్ట్రీ పరిశ్రమకు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి రాజస్థాన్, మహారాష్ట్రల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. దాని వల్ల ఆయా రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు భారీ నష్టాలు వాటిల్లాయి. దేశవ్యాప్తంగా దాదాపు రూ.3,400 కోట్ల మేర పౌల్ట్రీ పరిశ్రమకు నష్టం వాటిల్లినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో రోజూ సగటున 2 కిలోల బరువుండే ఏడు లక్షల కోళ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్) మేనేజర్ సంజీవ్ చింత్వార్ చెప్పారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా లేనప్పటికీ.. ఆ భయం చాలా మందిని చికెన్ వైపు చూడనివ్వలేదని, ఫలితంగా అమ్మకాలు పడిపోయాయని చెప్పారు. కోడిగుడ్ల అమ్మకాలూ తగ్గాయన్నారు.
అయితే, అమ్మకాలు పడిపోయినా చికెన్ ధరలు మాత్రం తగ్గలేదు. పౌల్ట్రీ రైతులకు నష్టాలు వచ్చినా.. చికెన్ అమ్మే రిటైల్ వ్యాపారులు మాత్రం భారీగా లాభపడ్డారని ఓ రైతు చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా లేకపోవడంతో మళ్లీ ఇప్పుడిప్పుడే మార్కెట్ పుంజుకుంటోందని పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, మంచి స్థితికి రావడానికి మాత్రం కొంచెం సమయం పడుతుందని అంటున్నారు.