Saudi Arabia: 1001 రోజుల తర్వాత జైలు నుంచి ఇల్లు చేరిన సౌదీ హక్కుల కార్యకర్త
- మహిళల హక్కులపై పోరాడినందుకు లౌజైన్ ను జైలులో పెట్టిన సౌదీ ప్రభుత్వం
- పోరాడిన లౌజైన్ కుటుంబం.. అంతర్జాతీయ సమాజం దృష్టికి సమస్య
- ఒత్తిడి పెంచిన అమెరికా, ఇతర ప్రపంచ దేశాలు.. తలొగ్గిన సౌదీ
- విడుదల చేయడాన్ని స్వాగతించిన బైడెన్.. మంచి పనిచేశారని వ్యాఖ్య
1001 రోజులు.. ఆమె జైలులో గడిపారు. ఎట్టకేలకు విడుదలయ్యారు. ఆమె చేసిన నేరం మహిళల హక్కుల కోసం పోరాడడమే. మహిళలకూ కారు నడిపే హక్కులివ్వాలన్నది ఆమె డిమాండ్. ఆమె పేరు లౌజైన్ అల్ హత్లౌల్. సౌదీ అరేబియా ఆమెది. మహిళలకూ డ్రైవింగ్ చేసే అవకాశం కల్పిస్తూ.. సౌదీ అరేబియా చారిత్రక నిర్ణయం తీసుకున్న కొన్ని వారాల ముందే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 మేలో జైలుకు తరలించారు. ఆమెతో మరికొందరినీ అరెస్ట్ చేశారు.
అయితే, లౌజైన్ విడుదల కోసం అప్పట్నుంచీ ఆమె కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమెరికా సౌదీపై ఒత్తిడి పెంచింది. మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మూడేళ్ల తర్వాత గురువారం ఆమెను సౌదీ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది.
ఈ విషయాన్ని ఆమె సోదరి లీనా అల్ హత్లౌల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1001 రోజుల తర్వాత లౌజైన్ ఇల్లు చేరిందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఇదివరకే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆమెను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మంచి పని చేశారంటూ వ్యాఖ్యానించారు. అసలు ఆమెను జైలుకు పంపించి ఉండాల్సింది కాదంటూ అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.