KCR: మేయర్ అయ్యే అర్హతలున్న వాళ్లు మీలో చాలామందే ఉంటారు... కానీ అందరికీ ఇవ్వలేం: కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్
- ముగిసిన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
- నగర మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక
- సీఎం కేసీఆర్ ను కలిసిన మేయర్, డిప్యూటీ మేయర్
- అభినందించిన సీఎం
- పేదలను అర్థం చేసుకుని ఆదరించాలని సూచన
- నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ మధ్యాహ్నం పూర్తయింది. టీఆర్ఎస్ కు చెందిన గద్వాల విజయలక్ష్మి మేయర్ గా, మోతె శ్రీలత శోభన్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఎన్నికైన అనంతరం వారిద్దరూ ప్రగతి భవనలో సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన సీఎం కేసీఆర్, ఆపై కర్తవ్యబోధ చేశారు.
విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న నగరం హైదరాబాద్ అనీ, అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా విలసిల్లుతోందని తెలిపారు. అలాంటి హైదరాబాద్ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా నూతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని స్పష్టం చేశారు.
కోట్లాది మందిలో కొద్దిమందికి మాత్రమే పరిస్థితులు కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని, అయితే గొప్పవిషయం అది కాదని అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవడమే గొప్ప విషయం అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.
పదవి వచ్చినంత మాత్రాన సహజత్వం కోల్పోవద్దని హితవు పలికారు. అవసరం లేని మాటలు, వేషభాషల్లో మార్పులతో లాభం లేకపోగా, కొన్ని సమయాల్లో వికటిస్తాయని హెచ్చరించారు. సమస్యలతో వచ్చే ప్రజల కులమతాలు చూడొద్దని జీహెచ్ఎంసీ నూతన కార్యకవర్గానికి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రముఖ ప్రజాగాయకుడు గోరటి వెంకన్న పాడిన 'గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది' అనే పాటను ప్రస్తావించారు. అందరూ ఆ పాట వినాలని, తాను ఆ పాటను వందసార్లు విన్నానని వెల్లడించారు. బస్తీల్లో పర్యటించి పేదలను అర్థం చేసుకుని ఆదరించడమే ప్రధాన లక్ష్యం కావాలని ఉద్బోధించారు.
ఇక, మేయర్ పదవి గురించి మాట్లాడుతూ, మేయర్ కావాల్సిన అర్హతలు ఉన్నవాళ్లు కార్పొరేటర్లలో చాలామంది ఉన్నా, అందరికీ అవకాశం ఇవ్వలేమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంతమంది కార్పొరేటర్లలో ఒక్కరికే మేయర్ అవకాశం ఇవ్వగలమని, తన పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారని వివరించారు. పరిస్థితిని అర్థం చేసుకుని అందరూ కలిసికట్టుగా నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు ఉన్నారు.