Ladakh: గాల్వాన్ లో నాటి ఘర్షణలో భారత్ చేతిలో 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు: రష్యా అధికార పత్రిక
- గత ఏడాది జూన్ 15న లడఖ్ లో ఘర్ణణ
- అమరులైన 20 మంది భారత జవాన్లు
- తన సైనికుల మృతి వివరాలను ఇంత వరకు వెల్లడించని చైనా
గత ఏడాది జూన్ 15న లడఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిందే. ఈ ఘర్షణల్లో తమ జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు భారత్ అప్పుడే ప్రకటించింది. చైనా మాత్రం వారి సైనికులు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని ఇంత వరకు వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో రష్యా అధికార వార్తా సంస్థ 'టాస్' సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆనాటి ఘర్షణల్లో 45 మంది చైనా సైనికులు మృతి చెందారని ఆ పత్రిక వెల్లడించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ చైనా, భారత్ లు బలగాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో టాస్ ఈ కథనాన్ని ప్రచురించింది.
ఆనాటి ఘర్షణల్లో అమరులైన జవాన్లకు భారత ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన జవాన్లకు అత్యున్నత పురస్కారాలను కూడా ప్రకటించింది. కానీ, చైనా మాత్రం ప్రాణాలు కోల్పోయిన వారి జవాన్ల పేర్లను ప్రకటించలేదు. వారి శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేయవద్దని వారి కుటుంబసభ్యులను హెచ్చరించింది.