Whatsapp: వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీపై మేం మరింత వివరణాత్మకంగా చెబితే బాగుండేది: ఫేస్ బుక్

Facebook India opines on Whatsapp new privacy policy
  • నూతన ప్రైవసీ పాలసీ తీసుకువచ్చిన వాట్సాప్
  • విమర్శల పాలైన ప్రైవసీ పాలసీ
  • యూజర్ల భద్రతకు పెద్దపీట వేస్తామన్న ఫేస్ బుక్ ఇండియా ఎండీ
  • యూజర్ల సందేశాలను తాము చదవబోమని వెల్లడి
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల తీసుకువచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విమర్శల పాలవడం తెలిసిందే. యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు ఇది వ్యతిరేకంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ వివరణ ఇచ్చింది. ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఓ కార్యక్రమంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మాట్లాడారు. ప్రైవసీ పాలసీపై తాము మరికొంచెం వివరణాత్మకంగా చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత సమాచారం ఎన్ క్రిప్షన్ చేయడంలో వాట్సాప్ నిబద్ధతను ఎవరూ శంకించలేరని, తామేమీ యూజర్ల సందేశాలను చదవబోమని, ఏ ఒక్కరి సందేశాలను తాము వీక్షించబోమని, ఇతరులెవ్వరూ కూడా యూజర్ల సందేశాల్లోకి తొంగి చూసే అవకాశం లేదని అజిత్ మోహన్ స్పష్టం చేశారు. ప్రైవసీ పాలసీలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేశామో అందరికీ అర్థమయ్యేలా వివరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.

ఫేక్ న్యూస్ అంశంపైనా ఆయన స్పందించారు. ఓ బాధ్యతాయుతమైన సంస్థగా భారత చట్టాలను తాము గౌరవిస్తామని, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి తమ వేదికలను పెద్దసంఖ్యలో భారతీయులు వినియోగిస్తున్నారని వెల్లడించారు. తమ వేదికలను దుర్వినియోగపర్చడాన్ని తాము కోరుకోవడంలేదని స్పష్టం చేశారు.
Whatsapp
Privacy Policy
Facebook
Ajith Mohan

More Telugu News