Donald Trump: ట్రంప్ కు వ్యతిరేకంగా సంచలన వీడియోను బయటపెట్టిన డెమొక్రాట్లు... బిగుస్తున్న ఉచ్చు!
- వరుసగా రెండో రోజు కొనసాగిన చర్చ
- పెన్స్ ను ఉరితీయాలంటూ నిరసనకారుల నినాదాలు
- ట్రంప్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మండిపాటు
- వీడియో, ఆడియోలను విడుదల చేసిన డెమొక్రాట్లు
- ఇంతకన్నా సాక్ష్యం ఏంటని ప్రశ్న
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా సెనెట్ లో అభిశంసన తీర్మానంపై చర్చ సాగుతున్న వేళ, గతంలో ఎన్నడూ చూడని ఓ కీలక వీడియోను డెమొక్రాట్లు బయటపెట్టి, ట్రంప్ ను మరింత కష్టాల్లోకి నెట్టారు.
ఇక ఈ వీడియోలో మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తో పాటు స్పీకర్ నాన్సీ పెలోసీలు ఎక్కడున్నారో చూడాలంటూ ఆందోళనకారులు వెతికారు.అంతేకాదు, దూసుకొస్తున్న నిరసనకారులను చూసి ప్రతినిధులు భయపడటం, పెన్స్ సహా అందరినీ సేఫ్ గా ఉంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు, పెన్స్ ను ఉరి తీయాల్సిందేనని ఆందోళనకారులు నినాదాలు చేయడం తదితర దృశ్యాలు ఉన్నాయి.
ఇదే సమయంలో ఓ ఆడియో క్లిప్ ను కూడా విడుదల చేసిన డెమొక్రాట్లు, ఇంకతన్నా అభిశంసించేందుకు ఇంకేం కావాలని ప్రశ్నించారు. ఇందులో క్యాపిటల్ హిల్ వద్ద ఆందోళనకారుల చేతిలో గాయపడిన ఓ పోలీసు బాధతో అరుస్తున్నట్టు వినిపిస్తోంది. నిరసనకారులు తమపై ఇనుప కడ్డీలు విసురుతున్నారని, అదనపు బలగాలు వెంటనే పంపాలని ఆయన కేకలు పెడుతున్నట్టు వినిపిస్తోంది.
ఇక ట్రంప్ పై అభిశంసన తీర్మానంపై సెనెట్ లో విచారణ రెండో రోజుకు చేరగా, జామీ రస్కిన్ సహా పలువురు ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయనేమీ అమాయకుడు కాదని, కమాండర్ - ఇన్ - చీఫ్ హోదాలో ఉండి, ప్రజలను రక్షించాల్సిన ఆయన, రాజ్యాంగాన్ని, అమెరికాను అపహాస్యం చేశారని, చేసిన ప్రమాణాలను ఉల్లంఘించారనడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలని ప్రశ్నించారు.
మరో డెమొక్రాట్ నేత ప్లాస్కెట్ మాట్లాడుతూ, నాడు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆందోళనకారుల కంటబడితే, నేడు ప్రాణాలతో ఉండేవారు కాదని అన్నారు. సభ్యులున్న చోటుకు కేవలం 100 అడుగుల దూరంలోకి వారు వచ్చేశారని గుర్తు చేశారు. డెమోక్రాట్ ప్రతినిధుల వాదనల అనంతరం ట్రంప్ తరఫు లాయర్లు తమ వాదనలను తొలుత వినిపించనున్నారు. ఈ తీర్మానానికి రిపబ్లికన్లకు చెందిన ఆరుగురు సెనెటర్లు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.