West Bengal: ముందు మీ కొడుకు సంగతి మాట్లాడండి!: అమిత్ షాపై నిప్పులు చెరిగిన మమత బెనర్జీ

Mamata Fires on Amit Shah Once Again

  • బెంగాల్ లో ఈ సంవత్సరం ఎన్నికలు
  • తరచూ పర్యటిస్తున్న అమిత్ షా
  • అభిషేక్ బెనర్జీపై అమిత్ విమర్శలు
  • మీ కుమారుడు అంత ఎలా సంపాదించారని మమత ప్రశ్న
  • బెంగాల్ లో గేమ్ కు తాను సిద్ధమని జవాబు

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, అధికార తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా తృణమూల్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పని చేస్తుంటే, మమత ప్రభుత్వం బంధువుల సంక్షేమానికి మాత్రమే కృషి చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. తన మేనల్లుడిని సీఎంను చేయడమే ఆమె లక్ష్యమని అన్నారు.

అమిత్ షా పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే మమతా బెనర్జీ స్పందించి, దీటుగా ప్రతి విమర్శలు చేశారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, "వారు పదేపదే 'అత్త, మేనల్లుడు' అంటున్నారు. మరి, మీ కుమారుడి సంగతేంటి? మేము బెంగాల్ లో ఉండటమే తప్పయిందా? మీ కుమారుడు అంత డబ్బు ఎలా సంపాదించాడు? ముందు దీనికి సమాధానం చెప్పండి. నేను ఎల్లప్పుడూ నిజమే చెబుతాను. నాతో పోరాడితే ఓడిపోయేది మీరే" అని ఆమె అన్నారు.

వీరి మధ్య మాటల యుద్ధం అక్కడితో ముగియలేదు. ఠాకూర్ నగర్ లో పర్యటించిన అమిత్ షా, తన ప్రసంగాన్ని మమతపై విమర్శలతోనే ప్రారంభించారు. "కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఇంతకుముందు జరగాల్సిన నా పర్యటన రద్దయింది. ఇందుకు మమతా బెనర్జీ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించారు. ఏప్రిల్ వరకూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఈలోగా నేను పదే పదే వస్తూనే ఉంటాను. మీరు ఎన్నికల్లో ఓడిపోయేంతవరకూ నా పర్యటనలు సాగుతూనే ఉంటాయి" అని అన్నారు.

ఇక అమిత్ ప్రసంగంపై స్పందించిన మమత, "మేము ఆయన్ను స్వాగతిస్తూనే ఉంటాము. ఆయన ప్రచారానికి వచ్చినప్పుడల్లా బెంగాల్ ను విమర్శిస్తూనే ఉంటారు. నన్ను బెదిరించాలని చూస్తే, నేనేమీ భయపడను. మీరు మొదలుపెట్టిన ఆటను ఆడేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. ఈ ఆటలో నేను గోల్ కీపర్ ను. మీరు ఎన్ని గోల్స్ వేయగలరో చూస్తాను" అని బదులిచ్చారు.

  • Loading...

More Telugu News