Rahul Gandhi: నరేంద్ర మోదీ పిరికి వ్యక్తి... చైనా ముందు నిలువలేరు: రాహుల్ గాంధీ
- మోదీ తన కనీస బాధ్యతలను మరిచారు
- భారత భూ భాగాన్ని చైనాకు వదిలేశారు
- ఈ ఉదయం మీడియా సమావేశంలో రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీ చాలా పిరికి వ్యక్తని, చైనా ముందు నిలబడి పోరాడే వ్యక్తి కాదని కాంగ్రెన్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధికార కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, భారత భూభాగాన్ని పరిరక్షించడంలో ఇప్పటికే మోదీ విఫలమయ్యారని, ఆయన కనీసం తన బాధ్యతలు కూడా గుర్తుంచుకోలేదని ఆరోపించారు. భారత సైనికుల త్యాగాలను మోదీ అపహాస్యం చేస్తున్నారని, దీన్ని భారతీయులు ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదని అన్నారు.
తూర్పు లడఖ్ ప్రాంతంలోని పాంగ్యాంగ్ సరస్సు సమీపంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మోహరించిన చైనా, భారత సైనికులను వెనక్కు మళ్లించాలని నిర్ణయం వెలువడిన మరుసటి రోజున రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న మాట్లాడుతూ, చైనా, భారత్ ల మధ్య జరిగిన సీనియర్ కమాండర్ల స్థాయి చర్చల్లో 48 గంటల్లోగా పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాన్ని సైనికులు ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారని, మిగతా సమస్యలు సైతం త్వరలోనే పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఏప్రిల్ 2020 నుంచి సరిహద్దుల్లో ఇరు దేశాలూ నిర్మించిన కట్టడాలను తొలగించాలని కూడా ఇరు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఇక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా నిలిచిన గోగ్రా, చాండింగ్ నిగులాంగ్ నల్లా, ట్రాక్ జంక్షన్, డెమ్ చోక్ సెక్టార్ల విషయంలో తదుపరి దశ చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, పాంగ్ యాంగ్ సరస్సులో ఫింగర్ 4 వరకూ ఉన్న ప్రాంతమంతా భారత్ దేనని ఇండియా వాదిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో సైనికులు ఫింగర్ 3 వరకూ భారత సైన్యం వెనక్కు రావాలని ప్రధాని కోరడంపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, భారత దేశానికి చెందిన భూమిని చైనాకు అప్పగించారన్న విషయం స్పష్టమవుతోందని రాహుల్ అన్నారు. గోగ్రా నుంచి ఇంకా చైనా దళాలు వెనక్కు వెళ్లలేదని గుర్తు చేసిన ఆయన, కైలాశ్ రేంజ్ ని వీడి వెనక్కు వెళతామని భారత్ అంగీకరించడాన్ని తప్పుబట్టారు.