Uttarakhand: ధౌలీ గంగాలో ఒక్కసారిగా పెరిగిన నీటిమట్టం... ఆగిపోయిన సహాయక చర్యలు!
- టన్నెల్ పై నిట్ట నిలువుగా గుంత తవ్వాలని నిర్ణయం
- నదిలో నీరు పెరగడంతో నిలిచిన పనులు
- తగ్గిన తరువాతే తిరిగి చర్యలు మొదలు
- వెల్లడించిన ఉత్తరాఖండ్ డీజీపీ
గత వారంలో ఉత్తరాఖండ్ పరిధిలోని తపోవన్ హైడల్ ప్రాజెక్టు వద్ద సంభవించిన దుర్ఘటన తరువాత, గల్లంతైన వారిని వెతికేందుకు సహాయక సిబ్బంది జరుపుతున్న నిర్విరామ కృషి నిలిచిపోయింది. ధౌలీ గంగా నదిలో ఒక్కసారిగా నీటి మట్టం నిలిచిపోవడంతో టన్నెల్ వద్దకు వెళ్లేందుకు సహాయక బృందాలకు వీల్లేకపోయింది. ఇక్కడి అండర్ గ్రౌండ్ టన్నెల్ మధ్యకు చేరుకునేందుకు నిట్ట నిలువగా ఓ గుంత తవ్వాలని రెస్క్యూ టీమ్ నిర్ణయించుకోగా, ఆ పనులు కూడా ఆగిపోయాయి.
నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి నీటి మట్టం క్రమంగా పెరిగిందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. నీటి మట్టం ఏ మేరకు పెరుగుతుందన్న విషయమై ప్రస్తుతానికి ఎటువంటి అంచనాలనూ వేయలేకపోతున్నామని, సురక్షితమని భావించే 21 మీటర్ల లోతు మట్టానికి చాలా అధికంగా నీరు ప్రవహిస్తోందని అన్నారు. నీరు పెరుగుతున్న విషయాన్ని గమనించి, అన్ని ఎక్స్ కవేటర్లు, డ్రిల్లింగ్ మెషీన్ లు, విద్యుత్ జనరేటర్లను చాలా వేగంగా అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందని తెలిపారు.
రిషిగంగా ప్రాజెక్టు సమీపంలో పోలీసులను భారీగా మోహరించామని, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు విధుల్లో ఉన్నాయని అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నదిలో ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని సమీక్షిస్తున్నామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. ధౌలి గంగాలో నీటిమట్టం తగ్గగానే తిరిగి సహాయక చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెస్క్యూ టీములు సైతం తపోవన్ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాగా, ఇప్పటివరకూ 36 మృతదేహాలను వెలికితీయగా, 168 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదన్న సంగతి తెలిసిందే.