Kishan Reddy: మన భూభాగాన్ని చైనాకు అప్పగించారన్న రాహుల్ కు చురకలంటించిన కిషన్ రెడ్డి
- తూర్పు లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చారు
- భారత సైన్యం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కి చేరుకుంటోంది
- డెప్సాంగ్ పై రాజ్‌నాథ్ ఎందుకు మాట్లాడలేదు?: రాహుల్
- భారత భూభాగాన్ని ఎవరు అప్పగించారన్న విషయాన్ని నెహ్రూను అడుగు
- సమాధానం తప్పకుండా తెలుస్తుంది: కిషన్ రెడ్డి
తూర్పు లడఖ్‌లో భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... భారత సైన్యం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కి చేరుకుంటోందని తెలుసుకున్నామని, ఫింగర్ 4 మన దేశ భూభాగానికి చెందినది అయినప్పటికీ మన ఆర్మీ ఫింగర్ 3కి ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు.
మన భూభాగాన్ని చైనాకు ఎందుకు అప్పగిస్తున్నారని నిలదీశారు. చైనాతో నెలకొన్న పరిస్థితులపై నిన్న పార్లమెంటులో మాట్లాడిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా ప్రవేశించిన డెప్సాంగ్ మైదానాలపై ఎందుకు మాట్లాడలేదని రాహుల్ ప్రశ్నించారు. భారత ఆర్మీ చేసిన త్యాగాలను కూడా పక్కనపెట్టి, దేశానికి మోదీ ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలను దేశ ప్రజలు ప్రోత్సహించకూడదని చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. చైనాకు భారత భూభాగాన్ని ఎవరు అప్పగించారన్న విషయాన్ని రాహుల్.. జవహర్ లాల్ నెహ్రూను అడిగితే సమాధానం తప్పకుండా తెలుస్తుందని చురకలంటించారు. దేశభక్తి ఎవరికి ఉందో, ఎవరికి లేదో భారత ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.