Petrol: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన అసోం
- రూ.5 చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించిన ఆర్థిక మంత్రి
- మద్యం డ్యూటీపైనా 25 శాతం కోత
- ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
దేశమంతా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న కాలమిది. ధరల్లో సెంచరీ కొట్టేందుకు దూసుకుపోతున్న రోజులివి. అలాంటిది అసోంలో ధరలు తగ్గాయి. ఒకట్రెండు రూపాయలు కాదు.. ఏకంగా ఐదు రూపాయలు. మరి, అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించింది.
శుక్రవారం ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వాస్ అసెంబ్లీలో దానిపై ప్రకటన చేశారు. అంతేకాదు, మద్యంపై ఉన్న డ్యూటీని 25 శాతం తగ్గించారు. మార్చి–ఏప్రిల్ లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఆ రాష్ట్రంలో పర్యటించారు. వరాల జల్లు కురిపించారు.
వాస్తవానికి పెట్రోల్, డీజిల్ రేట్లపై బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అగ్రిసెస్ ను విధించింది. దాని వల్ల రూ.3 వరకు భారం పడింది. దీనిపై సామాన్యుల నుంచి ప్రతిపక్షాల దాకా విమర్శలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే అసోం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.