Kodali Nani: ఎస్ఈసీ షోకాజ్ నోటీసులపై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన కొడాలి నాని

Kodali Nani replies to SEC show cause notices in written
  • జగన్నాథ రథచక్రాల కిందపడి నిమ్మగడ్డ నలిగిపోతారన్న నాని
  • నాని వ్యాఖ్యలపై ఎస్ఈసీ ఆగ్రహం
  • షోకాజ్ నోటీసులు జారీ
  • గడువులోపే స్పందించిన కొడాలి నాని
  • ఎస్ఈసీ అంటే తనకెంతో గౌరవం అని వెల్లడి
తనపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ నోటీసులపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎస్ఈసీపై వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇచ్చారు. ఎస్ఈసీని కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని కొడాలి నాని స్పష్టం చేశారు.  

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలను వివరించడానికే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని, ఎస్ఈసీ పట్ల తనకు గౌరవభావం ఉందని తెలిపారు. తన మాటల వెనకున్న నిజమైన అర్థాన్ని ఎస్ఈసీ అర్థంచేసుకోలేకపోయారని కొడాలి నాని విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవభావం ఉందని, తానిచ్చిన వివరణను పరిశీలించి షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని ఎస్ఈసీని కోరారు.

అంతకుముందు, జగన్నాథ రథచక్రాల కింద పడి నిమ్మగడ్డ నలిగిపోతాడంటూ కొడాలి నాని వ్యాఖ్యానించగా, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ మంత్రికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దాంతో కొడాలి నాని ఆ లోపే తన సంజాయిషీతో లేఖ పంపారు.
Kodali Nani
Explanation
Show Cause Notices
SEC
Nimmagadda Ramesh Kumar
Andhra Pradesh

More Telugu News