Dinesh Trivedi: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తృణమూల్ ఎంపీ... అంతరాత్మ చెప్పినట్టు నడుచుకున్నానని వివరణ
- మమతా బెనర్జీని చూసి పార్టీలో చేరామని వెల్లడి
- ఇప్పుడు టీఎంసీ ఎంతమాత్రం మమతా పార్టీ కాదని వ్యాఖ్యలు
- పార్లమెంటులో మూగ ప్రేక్షకుడిలా కూర్చోలేకపోతున్నానని వివరణ
- బెంగాల్ లో జరిగే పరిణామాలపై మాట్లాడలేకపోతున్నానని విచారం
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్ త్రివేది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకున్నానని రాజీనామా అనంతరం ఆయన వెల్లడించారు. పార్లమెంటులో ఓ మూగ ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చోలేకపోతున్నానని, బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రేక్షక పాత్ర వహించడం మినహా ఏమీ చేయలేకపోతున్నందునే పదవికి రాజీనామా చేస్తున్నట్టు త్రివేది వివరించారు.
తన గళం వినిపించేందుకు తగిన వేదిక ఏదీ లేదని, ఇలాగైతే బెంగాల్ కు అన్యాయం చేసినవాడిని అవుతానని ఆయన తన మనోభావాలను పంచుకున్నారు. అయితే తాను ఒంటరివాడ్నని భావించడంలేదని, పార్టీలో ఎవర్ని అడిగినా ఇదే చెబుతారని వెల్లడించారు. తామంతా మమతా బెనర్జీని చూసే పార్టీలో చేరామని, కానీ ఇప్పుడు టీఎంసీ ఎంతమాత్రం మమతా పార్టీ కాదని వ్యాఖ్యానించారు.
కాగా, దినేశ్ త్రివేది రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన తమ పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానం పలుకుతామని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ అన్నారు.