Ayyanna Patrudu: పోస్కో సంస్థకు, సీఎం జగన్ కు మధ్యవర్తిగా విజయసాయి వ్యవహరిస్తున్నారు: అయ్యన్న
- స్టీల్ ప్లాంటు అంశంలో వైసీపీ, టీడీపీ మధ్య వార్
- పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎంతో కలిశారని టీడీపీ వెల్లడి
- స్టీల్ ప్లాంటును అమ్మే హక్కు మీకెక్కడిదంటూ అయ్యన్న ఆగ్రహం
- దోచుకునేందుకు తయారయ్యారంటూ వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం ఏపీలోని రాజకీయపక్షాల మధ్య విమర్శల పర్వానికి దారితీసింది. పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎం జగన్ ను కలవడం వెనుక ఆంతర్యమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కో సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఈ అంశంలో వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు.
పోస్కో సంస్థకు, సీఎం జగన్ కు మధ్య ఎంపీ విజయసాయిరెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పోస్కో యాజమాన్యాన్ని కలిసేందుకు విజయసాయిరెడ్డి అనేక పర్యాయాలు పూణే వెళ్లాడని అయ్యన్న తెలిపారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. పోస్కో సంస్థ సీఎండీకి విజయసాయిరెడ్డి సన్మానం చేస్తున్న ఫొటోలను అయ్యన్న ఈ సందర్భంగా పంచుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంత నిధులు లేవంటున్నారని, మరి పోస్కో సంస్థకు ఏపీలో గనులేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. పోస్కో సంస్థ యాజమాన్యంతో విజయసాయిరెడ్డి చేసిన సంప్రదింపులను బయటపెడతానని అయ్యన్న తెలిపారు. దోచుకునేందుకు విశాఖపట్నంలో అన్న, తెలంగాణలో చెల్లి తయారయ్యారంటూ పరోక్షంగా వైఎస్ షర్మిలపైనా వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటును విక్రయించే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు.