Suresh Kumar: ఆత్మహత్యాయత్నం చేసిన బాలుడికి కర్ణాటక మంత్రి హితోపదేశం!
- బెంగళూరులో ఘటన
- ఫీజుల కోసం విద్యార్థిపై స్కూలు యాజమాన్యం ఒత్తిడి
- ఉరేసుకోబోయిన విద్యార్థి
- కుటుంబ సభ్యుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
- కష్టాలకు ఎదురునిలిచి పోరాడాలన్న మంత్రి సురేశ్ కుమార్
ఇటీవల కర్ణాటకలో ఓ విద్యార్థి స్కూలు ఫీజులు కట్టలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫీజు చెల్లించాలని స్కూలు యాజమాన్యం గట్టిగా నిలదీయడంతో ఆ బాలుడు మంగళవారం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణం చెందేందుకు ప్రయత్నించాడు ఆ బాలుడు బెంగళూరులోని సోమసుందర పాళ్య ప్రాంతంలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే ఫీజు బకాయిలు చెల్లించాలంటూ స్కూలు యాజమాన్యం అతడిని తోటి విద్యార్థుల ముందు తీవ్రంగా దూషించింది. దాంతో మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అతడి ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనపై కర్ణాటక సెకండరీ విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ సమాచారం అందుకున్నారు. వెంటనే ఆ బాలుడి నివాసానికి వెళ్లి మంచి మాటలతో అతడిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. "నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ తల్లిదండ్రులు, నీ సోదరి ఎంత బాధపడేవారో తెలుసా? జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రతికూలతలనైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలి. ఆత్మహత్య వంటి పద్ధతులను ఎప్పుడూ అనుసరించకూడదు" అని ఉద్బోధించారు.
ఈ సందర్భంగా ఆయన మహేశ్ అనే ప్రతిభావంతుడైన పేద విద్యార్థి గురించి ఆ బాలుడికి వివరించారు. మహేశ్ ఓ వలసకూలీ కొడుకని, గతేడాది ఎస్ఎస్ఎల్ సీ పరీక్షల్లో మహేశ్ ఎంతో ప్రతిభ చూపాడని, దాంతో అతడి ఉన్నత చదువులకు సాయపడేందుకు అనేకమంది ముందుకొచ్చారని వివరించారు. జీవితం అంటే అలా ఉంటుందని భావించాలే తప్ప, కష్టాలు ఎదురయ్యానని మనో నిబ్బరం కోల్పోకూడదని హితవు పలికారు. కాగా, బాలుడ్ని ఫీజుల కోసం ఇబ్బంది పెట్టిన స్కూలు యాజమాన్యానికి కర్ణాటక విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది.