ISRO: గూగుల్ మ్యాప్స్ కు పోటీగా.. ఇస్రో దేశీ మ్యాప్స్
- మ్యాప్ మై ఇండియాతో కలిసి తయారు చేయనున్న అంతరిక్ష సంస్థ
- ఆత్మనిర్భర్ భారత్ ను ముందుకు తీసుకెళ్తుందన్న మ్యాప్ మై ఇండియా సీఈవో
- భూ పరిశీలనా సమాచార వ్యవస్థతో తయారు చేస్తామన్న ఇస్రో
ఎక్కడికైనా వెళ్లాలి.. ఆ చిరునామా తెలియదు.. వెంటనే గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్ లో అడ్రస్ కొట్టి వెళ్లాల్సిన చోటుకు వెళ్లిపోతాం. గూగుల్ కు ప్రత్యామ్నాయం యాపిల్ మ్యాప్స్. అది కూడా కేవలం ఐఫోన్ లలోనే ఉంటుంది. కానీ, ఇప్పుడు వాటికి ఓ దేశీ ప్రత్యామ్నాయం రాబోతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), మ్యాప్ మై ఇండియాలు కలిసి దేశీ మ్యాప్స్ యాప్ ను తీసుకురాబోతున్నాయి.
శుక్రవారమే దీనికి సంబంధించిన ఒప్పందం రెండు సంస్థల మధ్య జరిగిందని మ్యాప్ మై ఇండియా సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన్ వర్మ తెలిపారు. మ్యాపింగ్ సైట్, భూమికి సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఒప్పందం ఆత్మనిర్భర్ భారత్ ను మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. అంటే భవిష్యత్ లో విదేశీ యాప్ లపై ఆధారపడాల్సిన అవసరం రాదని అన్నారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ వంటి వాటిని వదిలేసి దేశీ యాప్స్ ను వాడుకునే వెసులుబాటు వస్తుందని చెప్పారు.
కాగా, మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ అయిన సీఈ ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఇస్రో శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఇస్రో నావిక్, మ్యాప్ మై ఇండియాకు చెందిన వెబ్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్, భువన్, వేదాస్, మోస్దాక్ వంటి భూ పరిశీలనా సమాచార వ్యవస్థ ద్వారా.. అధునాతన మ్యాప్ లను తయారు చేస్తామని ఇస్రో తెలిపింది. ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ ఆర్.ఉమామహేశ్వరన్.. ఒప్పందంపై సంతకం చేశారని ఇస్రో ప్రకటించింది.