Slack: మీరు 'శ్లాక్' వాడుతున్నారా... అయితే పాస్ వర్డ్ మార్చుకోండి!

Slack alerts users to change passwords
  • బిజినెస్ కమ్యూనికేషన్ యాప్ శ్లాక్ కు బగ్ ముప్పు
  • కొత్త వెర్షన్ లో బగ్ ఉన్నట్టు గుర్తింపు
  • లీకైన లాగిన్ సమాచారం
  • యూజర్లను అప్రమత్తం చేసిన శ్లాక్
ఈ టెక్నాలజీ యుగంలో ఆన్ లైన్ భద్రత ఎంతో ముఖ్యం. డేటా రక్షణకు పాస్ వర్డ్ కీలకమని తెలిసిందే. పాస్ వర్డ్ సమాచారం బహిర్గతమైందంటే చాలు, సైబర్ నేరగాళ్లు కాచుకుని ఉంటారు. ప్రముఖ బిజినెస్ కమ్యూనికేషన్ యాప్ శ్లాక్ కు ఇలాంటి సమస్యే వచ్చిపడింది. ఇటీవల శ్లాక్ కొత్త వెర్షన్ విడుదల చేసింది. అయితే ఇందులో బగ్ ఉన్నట్టు తేలింది. శ్లాక్ నూతన వెర్షన్ వాడుతున్న వారి పాస్ వర్డ్ లకు ఏమాత్రం రక్షణ లేదని గుర్తించారు. దాంతో ఆ యాప్ యాజమాన్యం వెంటనే తమ యూజర్లను అప్రమత్తం చేసింది.

బగ్ కారణంగా పాస్ వర్డ్ సమాచారానికి ముప్పు ఏర్పడిందని, వెంటనే కొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలని ఈ-మెయిల్ ద్వారా తెలిపింది. తాము ఈ-మెయిల్ ద్వారా పంపిన లింకుపై క్లిక్ చేసి పాస్ వర్డ్ మార్చుకోవాలని వివరించింది. యాప్ డేటాను తొలగించాలని, ఒకవేళ డేటా తొలగించడం కష్టమని భావిస్తే యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి, మళ్లీ కొత్తగా ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది.

కాగా, సింగిల్ సైన్ ఆన్ యూజర్లకు ఈ బగ్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఈ-మెయిల్, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అయ్యే యూజర్ల సమాచారం మాత్రం లీకైందని వెల్లడించింది. తాము ఆ బగ్ ను సరిదిద్దామని, యూజర్లు పాత పాస్ వర్డ్ లు మార్చుకోవాలని శ్లాక్ నిర్వాహకులు కోరారు.
Slack
APP
Business Communication
Password
Bug
New Version

More Telugu News