Raghu Rama Krishna Raju: మోదీని కలిసి మద్దతు కోరాను: రఘురామకృష్ణరాజు
- అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను
- ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉంది
- ఎంపీలతో కలిసి మోదీని జగన్ కలవాలి
ఏపీ రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోదీకి వివరించానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈరోజు ఆయన మోదీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో ఇప్పటికే రూ. 50 వేల కోట్ల పెట్టుబడి పెట్టారని... కానీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పట్టించుకోవడం లేదని అన్నారు.
అమరావతి కోసం న్యాయప్రకారం పోరాడుతున్నామని... తమ మద్దతు కూడా కావాలని మోదీని కోరానని చెప్పారు. తన విన్నపానికి మోదీ సానుకూలంగా స్పందించారని అన్నారు. అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... రాజధానిని తరలిస్తే లక్ష కోట్ల రూపాయల వరకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వోద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీలో మత మార్పిడులపై 25 పేజీల నోట్ ను ప్రధానికి అందజేశానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్, ఆంధ్రుల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పార్టీ ఎంపీలందరితో మోదీని కలవాలని... విశాఖ స్టీల్ ప్లాంట్ పై విన్నపం చేయాలని కోరారు.