Rinku Sharma: రింకు శర్మ హత్యకు అమిత్ షానే బాధ్యత వహించాలి: ఆప్
- బీజేపీ యువ మోర్చా సభ్యుడు రింకు శర్మపై దుండగుల దాడి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఢిల్లీలో హత్యలు సర్వసాధారణమయ్యాయన్న ఆప్ నేత భరద్వాజ్
ఢిల్లీలో హత్యలు సర్వసాధారణ విషయంగా మారిపోయాయని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మంగోల్ పురి ప్రాంతంలో రింకు శర్మ (25) హత్యకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడటంలో హోంమంత్రిత్వ శాఖ విఫలమైందని భరద్వాజ్ విమర్శించారు. రింకు శర్మ హత్యను ఖండిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగేలా కేంద్రం వ్యవహరించాలని అన్నారు.
హత్యకు గురైన రింకు శర్మ బీజేపీ యువ మోర్చా సభ్యుడు. వీహెచ్పీ సభ్యుడిగా కూడా ఉన్నారు. గత బుధవారం ఆయనపై దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తసుద్దీన్, మెహతాబ్, జాహిద్, ఇస్లాం, నస్రుద్దీన్ లను అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపారు.