Deep Sidhu: సీన్ రీ-కన్ స్ట్రక్షన్ కోసం నటుడు దీప్ సిద్ధూని ఎర్రకోటకు తీసుకెళ్లిన పోలీసులు
- గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ పరేడ్
- ఢిల్లీ ఎర్రకోట వద్ద అవాంఛనీయ ఘటనలు
- ట్రాక్టర్ పరేడ్ ను దారిమళ్లించాడంటూ దీప్ సిద్ధూపై ఆరోపణలు
- హర్యానాలో అరెస్ట్
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగడం తెలిసిందే. రైతుల ట్రాక్టర్ పరేడ్ దారిమళ్లి హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ ఘటనలకు కారకుడిగా భావిస్తున్న నటుడు దీప్ సిద్ధూను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో సీన్ రీ-కన్ స్ట్రక్షన్ కోసం దీప్ సిద్ధూని పోలీసులు ఎర్రకోట వద్దకు తీసుకెళ్లారు. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన పరిణామాలను దీప్ సిద్ధూ వెల్లడించిన సమాచారంతో పోల్చి చూడనున్నారు. ఇదే కేసులో అరెస్టయిన ఇక్బాల్ సింగ్ ను కూడా పోలీసులు ఎర్రకోట వద్దకు తీసుకెళ్లారు.
ఎర్రకోట వద్ద జరిగిన ఘటనకు దీప్ సిద్ధూనే సూత్రధారి అని బలంగా నమ్ముతున్న పోలీసులు అతడిని హర్యానాలోని కర్నాల్ బైపాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అటు, ఇక్బాల్ సింగ్ అరెస్ట్ పై పోలీసులు రూ.50 వేల రివార్డు కూడా ప్రకటించారు. అతడిని పంజాబ్ లోని హోషియార్ పూర్ వద్ద అరెస్ట్ చేశారు. అంతకుముందు దీప్ సిద్ధూ, జుగ్ రాజ్ సింగ్, గురుజ్యోత్ సింగ్, గుర్జంత్ సింగ్ ల ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. అసలు, రైతు ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి అని, ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు రైతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడని దీప్ సిద్ధూపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.