Chandrababu: కర్నూలు జిల్లా ఘోర ప్రమాదంపై చంద్రబాబు, పవన్ స్పందన

Chandrababu and Pawan Kalyan responds after fatal accident in Kurnool district

  • వెల్దుర్తి సమీపంలో టెంపో, లారీ ఢీ
  • 14 మంది మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్
  • హృదయం ద్రవించిపోతోందన్న చంద్రబాబు
  • ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్న పవన్

కర్నూలు జిల్లాలో టెంపో, లారీ ఢీకొన్న ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అరకులో జరిగిన దుర్ఘటన మరువక ముందే అంతకంటే ఎక్కువ ప్రాణనష్టం జరిగిన ఈ ప్రమాదం విషాదానికి గురిచేస్తోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.

వెల్దుర్తి మండలంలో జరిగిన ఈ ప్రమాద ఘటన గురించి తెలియగానే ఎంతో బాధ కలిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. 14 మంది మృతి చెందడం పట్ల వారి కుటుంబాల పరిస్థితి తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోతోందని తెలిపారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ...  కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారన్న విషయం మనసును కలచివేసిందని పేర్కొన్నారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని తెలిపారు. అజ్మీర్ దర్గాను దర్శించుకునేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని వివరించారు. చనిపోయిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు.

రాష్ట్ర సర్కారు రహదారి భద్రత అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రెండ్రోజుల కిందటే అరకు ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిపోయిందని, అంతలోనే వెల్దుర్తి ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ప్రయాణికుల వాహనాలు నడిపే డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అవసరం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News