Hyderabad: హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకోం... తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైర్

Leaders opposes to transform Hyderabad into Union Territory

  • తెరపైకి హైదరాబాద్ యూటీ అంశం
  • లోక్ సభలో ఒవైసీ వ్యాఖ్యలతో కలకలం
  • బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం కొత్త నాటకం ఆడుతున్నాయన్న జగ్గారెడ్డి
  • రహస్య అజెండాతో లీకులు ఇస్తున్నారని ఆరోపణ
  • హైదరాబాదును యూటీ చేస్తే ఒప్పుకునేది లేదన్న వీహెచ్

లోక్ సభలో జమ్మూకశ్మీర్ అంశంపై చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఒవైసీ ఆరోపించారు. ఇదే కోవలో చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేస్తారని అన్నారు. బీజేపీ విధానం ఇదేనని, కశ్మీర్ ను అందుకే యూటీగా మార్చారని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు.

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇది బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఆడుతున్న కొత్త నాటకం అని అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కేంద్ర పాలిత ప్రాంతం అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రహస్య అజెండాతోనే ఇలాంటి లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను ఎడారి చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

అటు సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు ఎంతో చరిత్ర ఉందని, హైదరాబాదును యూటీ చేస్తే ఒప్పుకోబోమని అన్నారు.

మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా ఈ అంశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే అసద్ తో ఈ వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. హైదరాబాదు లేని తెలంగాణను ఊహించుకోలేమని, రాష్ట్ర విభజన చట్టంలోకూడా హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని పేర్కొన్నారని స్పష్టం చేశారు.

హైదరాబాదు ఆదాయంతోనే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని, తెలంగాణకు హైదరాబాదు లేకపోతే అడుక్కుతినాల్సిందేనని అన్నారు. యూటీ ప్రచారంతో మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అసద్ తప్పుడు ప్రచారంతో బీజేపీ, టీఆర్ఎస్ కు లబ్ది చేకూరుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News