Prime Minister: పుల్వామా ఉగ్రదాడిని దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు: ప్రధాని మోదీ
- తరతరాలకు వారి తెగువ స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్య
- తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
- తమిళ రచయిత సుబ్రహ్మణ్యం భారతి కవితల ప్రస్తావన
- ఆయన స్ఫూర్తిగానే రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించామన్న ప్రధాని
- బలగాలను ప్రపంచంలోనే అధునాతనంగా మారుస్తామని వెల్లడి
పుల్వామా ఉగ్రదాడిని దేశం, దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజున 40 మంది సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాలను మరువబోమని, తరతరాలకు వారి తెగువ స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు. ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.
ప్రముఖ తమిళ రచయిత సుబ్రహ్మణ్యం భారతి చెప్పిన కొన్ని మాటలను ఆయన గుర్తు చేశారు. ‘‘మనం ఆయుధాలు తయారు చేద్దాం.. కాగితాలు తయారు చేద్దాం.. కర్మాగారాలు నిర్మిద్దాం.. పాఠశాలలను నెలకొల్పుదాం.. వాహనాలను రూపొందిద్దాం.. ఓడలను తయారుచేద్దాం’’ అన్న మాటలను గుర్తు చేశారు. ఆయన చెప్పిన మాటల స్ఫూర్తిగా ఈ రోజు దేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను, స్వావలంబనను సాధించిందని ప్రధాని పేర్కొన్నారు.
దేశంలోని రెండు రక్షణ కారిడార్లలో ఒకటి తమిళనాడులోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆ కారిడార్ కు రూ.8,100 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. మన సైనిక బలగాలను ప్రపంచంలోనే అత్యంత అధునాతన బలగాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను వేగంగా సాధించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
మన సైనికులు దేశ విలువలతో పాటు ధీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధాని మోదీ కొనియాడారు. సమయం వచ్చినప్పుడల్లా మాతృభూమిని కాపాడడంలో తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారన్నారు. శాంతి సామరస్యాలను నమ్ముతూనే.. మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే కుట్రలను దీటుగా ఎదుర్కొంటున్నారన్నారు.