Rahul Gandhi: అసోంలో కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Rahul Gandhi once again fires on PM Modi
  • మాకు అధికారమిస్తే సీఏఏను అమలు కానివ్వం
  • రాష్ట్రాన్ని విభజించాలని ఆరెస్సెస్, బీజేపీ కుట్ర
  • 167 రూపాయలు చూపిస్తూ రాహుల్ ప్రసంగం
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో అప్పుడే రాజకీయ వేడి రగులుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు రంగంలోకి దిగి ప్రచారం ప్రారంభించాయి. తాజాగా, నిన్న శివసాగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు.

సీఏఏ అని రాసున్న అక్షరాలను కొట్టివేసినట్టున్న కండువాను ధరించిన రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ప్రధాని మోదీకి కానీ, ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు కానీ ఏమీ నష్టం జరగదని, కానీ రాష్ట్ర ప్రజలకు, దేశంలోని మిగతా ప్రాంతాలకు తీరని హాని జరుగుతుందని అన్నారు.

ఈ దేశం మీకెంత అవసరమో, దేశానికీ మీరు అంతే అవసరమన్న రాహుల్.. ప్రపంచంలోని ఏ శక్తీ రాష్ట్రాన్ని విభజించలేదన్నారు. అసోం ఒప్పందం జోలికి రావాలని చూసే వారికి కాంగ్రెస్, రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అసోంలో కనుక కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానీయబోమని స్పష్టం చేశారు.

సభలో మాట్లాడుతూ రాహుల్ 167 రూపాయలను ప్రజలకు చూపించారు. తేయాకు కార్మికులకు రోజు వారీ దక్కుతున్నది ఇంతేనని, కానీ గుజరాతీ వ్యాపారవేత్తలు మాత్రం తేయాకు తోటలనే దక్కించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తేయాకు కార్మికులకు రోజుకు రూ. 367 అందిస్తామని హామీ ఇచ్చారు.
Rahul Gandhi
Assam
Congress
Narendra Modi

More Telugu News