Liquor: అతిగా మద్యం తాగే వారికి హెచ్చరిక.. పురుషుల డీఎన్ఏలో మార్పులు!
- బెంగళూరు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
- అతిగా తాగే వారిలో తొలుత ఏయూడీ రుగ్మత
- మానేసినా మూడు నెలలపాటు అవే మార్పులు
అతిగా మద్యం తాగే వారికి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, అలాంటి వారికి మరో ముప్పు పొంచి ఉన్నట్టు బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మితిమీరి మద్యం తాగే వారి డీఎన్ఏలో మార్పులు సంతరించుకుంటాయని వారు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అతిగా మద్యం తాగే వారిలో తొలుత ‘ఆల్కహాల్ యూజ్ డిజార్డర్’ (ఏయూడీ) తలెత్తుతుందని, ఆ తర్వాత అది పురుషుల డీఎన్ఏలో మార్పులకు కారణమవుతుందని వెల్లడైంది.
ఏయూడీ బారినపడిన తర్వాత మద్యానికి దూరంగా ఉన్నప్పటికీ మూడు నెలలపాటు ఏయూడీ కారణంగా వచ్చిన మార్పులు అలానే ఉంటాయని పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు వివరించారు. 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు. ఏయూడీ కారణంగా డీఎన్ఏలో మిథైల్ గ్రూప్స్ వచ్చి చేరుతాయని, ఇవి డీఎన్ఏలో మార్పులకు కారణమవుతాయని పేర్కొన్నారు.
మన దేశంలో 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 29 శాతం మద్యం తాగుతారని అంచనా. వీరిలో 12 శాతం రోజూ తాగుతారని, 41 శాతం మంది వారానికి ఒకసారి మద్యం తీసుకుంటారని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా, ఏయూడీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 30 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.