Chennai: 300 పరుగులు దాటిన భారత్ లీడ్!
- చెన్నైలో జరుగుతున్న టెస్ట్
- వరుసగా పెవిలియన్ కు టీమిండియా ఆటగాళ్లు
- ఆరు వికెట్లు కోల్పోయిన వైనం
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఓ వైపున స్కోరును పెంచుకుంటూ, పట్టు బిగిస్తున్న భారత జట్టు, మరోపక్క తన వికెట్లనూ కోల్పోతోంది. పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉండటంతో, వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్ దారి పట్టారు. ఓపెనర్ రోహిత్ శర్మ 26, శుభమన్ గిల్ 14, ఛటేశ్వర్ పుజారా 7, రిషబ్ పంత్ 8, అజింక్యా రహానే 10, అక్సర్ పటేల్ 7 పరుగులకు అవుట్ అయ్యారు.
ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ 18 పరుగులతో క్రీజులో ఉండగా, అతనికి రవిచంద్రన్ అశ్విన్ జత కలిశాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 106 పరుగులు. ఇంగ్లండ్ పై భారత్ ప్రస్తుతం 301 పరుగుల లీడ్ లో ఉంది. ఆట ఇంకా మరో రెండున్నర రోజులు ఉండటంతో సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి, స్కోరును మరింత ఆధిక్యానికి తీసుకెళ్లాలన్న ప్రణాళికతో ఇండియా ఉంది.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ కు 3 వికెట్లు, మోయిన్ అలీకి 1 వికెట్ లభించగా, పుజారా రన్నౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 329 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా ఇంగ్లండ్ 134 పరుగులకే ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.