India: 86 బంతుల్లో కోహ్లీ 38 పరుగులు... 38 బంతుల్లోనే అశ్విన్ 34 పరుగులు!
- సొంత మైదానంలో రెచ్చిపోతున్న అశ్విన్
- పిచ్ లపై పూర్తి అవగాహనతో ఆడుతున్న స్పిన్నర్
- 350 పరుగులు దాటిన భారత్ లీడ్
తాను నిలదొక్కుకుని ఆడాలని భావిస్తూ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయత్నిస్తున్న వేళ, టెయిలెండర్ గా వచ్చిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన సొంత గడ్డపై ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 86 బంతుల్లో స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ 38 పరుగులు మాత్రమే చేయగలిగిన వేళ, తానాడిన 38 బంతుల్లోనే అశ్విన్ 34 పరుగులు సాధించగా, భారత జట్టు ఇన్నింగ్స్ లీడ్ 350 పరుగులు దాటింది.
చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో ఆరు వికెట్లు కోల్పోయిన తరువాత క్రీజులోకి వచ్చిన అశ్విన్, ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన సొంత మైదానమైన చెపాక్ గురించి, అక్కడి పిచ్ ల గురించి పూర్తి అవగాహన ఉన్నఅశ్విన్ ను పెవిలియన్ కు పంపేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తనకు అనుకూలంగా ఉన్న బంతులను బౌండరీలకు పంపిన అశ్విన్ ఇప్పటివరకూ 5 ఫోర్లు బాదాడు.
దీంతో లంచ్ విరామం సమయానికి భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ను కలుపుకుని భారత్ లీడ్ 351 పరుగులకు చేరుకుంది. ప్రస్తుతం అశ్విన్ 34, కోహ్లీ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లోఇంగ్లండ్ విజయం దాదాపు అసాధ్యమేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా సహకరిస్తూ ఉండటం, బాల్ క్రీజును తాకిన ప్రతి సమయంలో మట్టి లేస్తూ ఉండటం, అది ఎటువైపు తిరుగుతుందో ఎవరికీ తెలియక పోవడమే ఇందుకు కారణం.