Whatsapp: మీది ట్రిలియన్ డాలర్ల సంస్థే కావచ్చు.. కానీ.. : వాట్సాప్ కు సుప్రీంకోర్టు నోటీసులు
- కొత్త గోప్యతా విధానాన్ని తీసుకొచ్చిన వాట్సాప్
- సమాచార గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యూజర్లు
- ప్రజల గోప్యతను కాపాడటం తమ బాధ్యత అన్న సుప్రీంకోర్టు
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్, దానికి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇటీవల అవి ప్రవేశపెట్టిన నూతన గోప్యతా విధానంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
మీది రెండు లేదా మూడు ట్రిలియన్ డాలర్ల సంస్థ కావచ్చు... కానీ మీకంటే ప్రజలు వారి గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ప్రజల గోప్యతను కాపాడటం తమ బాధ్యత అని స్పష్టం చేసింది. గోప్యత లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించింది. ఎవరికైనా మెసేజ్ పంపితే అది ఫేస్ బుక్ కు అందుబాటులో ఉంటోందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పింది.
విచారణ సందర్భంగా ఫేస్ బుక్, వాట్సాప్ తరపున కపిల్ సిబాల్ వాదిస్తూ... నూతన గోప్యతా విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు వెళ్లదని అన్నారు. ప్రైవసీపై యూరప్ లో ఒక ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టాలనే తీసుకొస్తే, దాన్ని అనుసరించడం జరుగుతుందని చెప్పారు.