Ration Cards: టీవీ, బైక్, ఫ్రిజ్ ఉంటే నో రేషన్ కార్డ్... కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం
- బీపీఎల్ రేషన్ కార్డులకు కొత్త నిబంధనలు
- ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే అనర్హులని వెల్లడి
- వార్షికాదాయం రూ.1.20 లక్షలు దాటినా కార్డుపై వేటే!
- ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నిరసనలు
కర్ణాటకలో బీపీఎల్ (దారిద్ర్యరేఖకు దిగువన) రేషన్ కార్డులకు అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. టీవీ, బైక్, ఫ్రిజ్ ఉంటే రేషన్ కార్డుకు అనర్హులని స్పష్టం చేసింది. ఐదెకరాలు, అంతకంటే ఎక్కువ భూమి కలిగివున్న వారు కూడా రేషన్ కార్డు పొందలేరని వెల్లడించింది. తాము నిర్దేశించిన మేరకు అనర్హులైన కార్డుదారులు తమ రేషన్ కార్డులను మార్చి 31 లోపు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మార్చి 31 తర్వాత అనర్హుల వద్ద రేషన్ కార్డు ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బీపీఎల్ రేషన్ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు నిర్దేశించామని, ఐదెకరాలకు మించి భూమి ఉండరాదని, బైక్, టీవీ, ఫ్రిజ్ కలిగి ఉండకూడదని కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కట్టీ వెల్లడించారు. అంతేకాదు, ఏడాదికి రూ.1.20 లక్షల ఆదాయం పొందుతున్న వారు కూడా బీపీఎల్ రేషన్ కార్డులు వినియోగించేందుకు అనర్హులని, వారు కూడా కార్డులను ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి స్పష్టం చేశారు.
అయితే సర్కారు తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరులోని పలు రేషన్ దుకాణాల ముందు నిరసనలు చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యూటీ ఖాదర్ స్పందించారు. సిద్ధరామయ్య సర్కారు హయాంలో తాను పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల చాలామంది పేదలపై ప్రభావం పడుతుందని తాము అమలు చేయలేదని వివరించారు. టీవీలు, బైకులు, ఫ్రిజ్ లపై భారీగా తగ్గింపు ఆఫర్లు వస్తే పేదవాళ్లు కూడా కొనుక్కునే ప్రయత్నం చేస్తారని, అలాగని వారికి రేషన్ కార్డులు దూరం చేయడం సరికాదని హితవు పలికారు.