Andhra Pradesh: ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
- వాహనాల రంగు మార్చాలని ఎస్ఈసీ ఆదేశాలు
- రేషన్ సరఫరా నిరంతర ప్రక్రియ అన్న ప్రభుత్వం
- వాహనాల రంగులు మార్చడం ఖర్చుతో కూడుకున్నదని వ్యాఖ్య
రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేషన్ ను సరఫరా చేసే వాహనాల రంగులను మార్చాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది. అంతవరకు తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పింది.
హైకోర్టులో విచారణ సందర్భంగా రేషన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని... వాహనాల రంగు మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ వాదనతో సంతృప్తి చెందిన కోర్టు ఎస్ఈసీ ఉత్తర్వులపై స్టే విధించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో రేషన్ డోర్ డెలివరీకి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది.
వాహనాల డ్రైవర్లు వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, కోడ్ కారణంగా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనేందుకు మాత్రం వీలుండదు.