Somu Veerraju: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వద్దంటూ కేంద్రం పెద్దలను కలిసిన ఏపీ బీజేపీ బృందం

AP BJP delegation met Union Minister Dharmendra Pradhan and JP Nadda

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • వ్యతిరేకిస్తున్న ఏపీ రాజకీయ పక్షాలు
  • ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ నేతలు
  • ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డాలతో సమావేశం

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని ఏపీ రాజకీయపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరికి తోచిన మార్గాల్లో వారు ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా, ఏపీ బీజేపీ బృందం ఢిల్లీలో కేంద్రం పెద్దలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ ఢిల్లీలో పర్యటించారు.

వారు తొలుత కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సోము వీర్రాజు స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, వారి మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రికి తెలియజేశామని వివరించారు. ఉక్కు కర్మాగారం ఉద్యోగుల శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రైవేటీకరణ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, స్టీల్ ప్లాంట్ ను సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయొచ్చని ప్రతిపాదించామని చెప్పారు.

కాగా, ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అనంతరం ఏపీ బీజేపీ బృందం కమలనాథుల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసింది. సోము వీర్రాజు, పురందేశ్వరి, సునీల్ దేవధర్... నడ్డాతో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. నడ్డాకు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రజల అభిప్రాయాలను వివరించామని బీజేపీ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News