Sachin Tendulkar: సచిన్, లత ట్వీట్లపై కాదు.. బీజేపీ ఐటీ సెల్‌పైనే దర్యాప్తు: మహారాష్ట్ర సర్కారు
- దర్యాప్తుపై వెనక్కి తగ్గిన ఉద్ధవ్ సర్కారు
- తమ ప్రకటనపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం
- బీజేపీ ఐటీ విభాగం హెడ్ సహా 12 మందిపైనే దర్యాప్తు అన్న మంత్రి
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుతూ ఒకేలా చేసిన ట్వీట్లపై దర్యాప్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వారి ట్వీట్లపై దర్యాప్తు చేయడం లేదని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. సచిన్, లతా మంగేష్కర్ ట్వీట్ల వ్యవహారంలో బీజేపీ ఐటీ విభాగం పాత్రపైనే దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.
గతంలోనూ ఇదే విషయం చెప్పినా కొందరు దానిని సెలబ్రిటీల ట్వీట్లపై దర్యాప్తునకు ఆదేశించారంటూ తప్పుడు ప్రచారం చేశారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ ఐటీ విభాగం హెడ్‌తోపాటు దానితో సంబంధాలున్న 12 మందిపైనా దర్యాప్తు చేస్తామని మంత్రి వివరించారు.