Gajendra Singh Shekhawat: ప్రపంచానికి దేశం పీపీఈ కిట్లు ఇస్తుంటే.. కొందరు మనపైనే టూల్ కిట్లు తయారు చేస్తున్నారు: కేంద్ర మంత్రి
- సిగ్గు పడాల్సిన విషయమంటూ గజేంద్ర సింగ్ షెకావత్ మండిపాటు
- టూల్ కిట్ వ్యవహారంపై స్పందన
- లెఫ్టినెంట్ ఖేత్రపాల్ పట్ల గర్వపడతానని వెల్లడి
ప్రస్తుతం దేశంలో గ్రెటా థన్ బర్గ్ టూల్ కిట్ వ్యవహారం కలకలం రేపుతోంది. కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరుకు చెందిన విద్యార్థిని దిశా రవి, ముంబై లాయర్ నిఖితా జాకబ్, ఇంజనీర్ శంతనుల అరెస్టులు కూడా జరిగాయి. ఈ క్రమంలో దిశా రవి వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచానికి భారత్ పీపీఈ (వ్యక్తిగత రక్షణ కవచాలు) కిట్లు అందిస్తుంటే.. కొందరు మాత్రం దేశప్రజలకు నష్టం కలిగించేలా టూల్ కిట్లు తయారు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సిగ్గుపడాల్సిన విషయమంటూ టూల్ కిట్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 ఏళ్ల అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకూ ఆయన సమాధానం చెప్పారు.
‘‘వయసే ప్రామాణికం అయితే.. 21 ఏళ్లకే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి పరమ వీర చక్ర పొందిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ నే ఆదర్శంగా తీసుకుంటా. ఆ త్యాగాన్ని గర్వంగా ఫీలవుతా. అంతేకానీ, ఇలా టూల్ కిట్ తో చెడు ప్రచారం చేసే వారి పట్ల అస్సలు కాదు’’ అని ఆయన అన్నారు.