Palla Srinivasarao: చంద్రబాబు ఆదేశాల మేరకు దీక్ష విరమిస్తున్నా: పల్లా శ్రీనివాసరావు
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ పల్లా దీక్ష
- ఈ నెల 10 నుంచి దీక్ష
- క్షీణించిన ఆరోగ్యం
- ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ఆసుపత్రిలో పల్లాను పరామర్శించిన చంద్రబాబు
- నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్ష ముగిసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు దీక్ష విరమిస్తున్నట్టు పల్లా వెల్లడించారు. పల్లా ఈ నెల 10 నుంచి విశాఖలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఇవాళ ఉదయం ఆయనను దీక్ష శిబిరం నుంచి పోలీసులు బలవంతంగా కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకుని కిమ్స్ లో పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు మీ ప్రయత్నం మీరు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అందరినీ కలుపుకుని ఈ విషయంలో ముందుకెళ్లాల్సి ఉంటుంది. సమష్టిగా పోరాడాలే తప్ప ఈ అంశంలో ప్రాణత్యాగం పరిష్కారం కాబోదు' అని అభిప్రాయపడ్డారు.