Aravind Kumar: పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కీచక ప్రిన్సిపల్ కు మరణశిక్ష
- ఐదో తరగతి చదువుతున్న బాలిక
- అనారోగ్యం బారినపడుతుండడంతో వైద్య పరీక్షలు
- గర్భవతి అని తేలిన వైనం
- ప్రిన్సిపల్ అత్యాచారం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడి
- ప్రిన్సిపల్ కు సహకరించిన మరో ఉపాధ్యాయుడు
అభంశుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, పదకొండేళ్ల వయసుకే ఆమెను గర్భవతిని చేసిన కీచక ప్రిన్సిపల్ కు బీహార్ లో మరణశిక్ష విధించారు. 2018లో ఈ ఘటన జరగ్గా, కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. బీహార్ లోని పుల్వారీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఓ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక అనారోగ్యం బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. ఆ చిన్నారి గర్భంతో ఉందన్న వైద్య నివేదికలు ఆ తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో మరింత దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. స్కూలు ప్రిన్సిపల్ అరవింద్ కుమార్ ఆమెపై అత్యాచారం చేసినట్టు వెల్లడైంది. అతడికి టీచర్ అభిషేక్ కుమార్ సహకరించాడని పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ కీచక ప్రిన్సిపల్ ను అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణ చేపట్టిన పాట్నాలోని పోక్సో కోర్టు ప్రిన్సిపల్ అరవింద్ కుమార్ కు ఉరిశిక్ష విధిస్తూ నేడు తీర్పు వెలువరించింది. లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. అతడికి సహకరించిన అభిషేక్ కుమార్ కు జీవితఖైదు, రూ.50 వేల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.