Andhra Pradesh: ఏపీలో రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలు... ఏర్పాట్లు పూర్తి
- 13 జిల్లాల్లో 2,640 పంచాయతీలకు పోలింగ్
- 26,851 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం
- ఏజెన్సీ ప్రాంతాల్లో 1.30 గంటలకే పోలింగ్ ముగింపు
- ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కంట్రోల్ సెంటర్లు
ఏపీలో రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడుతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు.
మూడో విడత ఎన్నికల కోసం రాష్ట్రంలో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలను వర్గీకరించి, వాటికి అదనపు భద్రత కల్పించారు. ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల తీరుపై పర్యవేక్షణ చేయనున్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.