Uttar Pradesh: మహిళల భద్రత కోసం యూపీ పోలీసుల కొత్త వ్యూహం.. అశ్లీల చిత్రాలు చూసేవారిపై నిఘా!
- ఇంటర్నెట్ యూజర్లపై పోలీసుల నిఘా
- అదే పనిగా పోర్న్ చూసేవారికి అలెర్ట్ మెసేజ్
- తొలుత ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు
మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సరికొత్త వ్యూహం రచించారు. మహిళలపై అత్యాచారాల పెరుగుదలకు పోర్న్ (అశ్లీల చిత్రాలు) వీక్షణే కారణమని భావిస్తున్న పోలీసులు ఇకపై అలాంటి వారిపై నిఘా వేయాలని నిర్ణయించారు.
ప్రజలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు? పోర్న్ సైట్లను అదే పనిగా చూస్తున్నారా? అన్న దానిపై నిఘా పెట్టనున్నారు. పోర్న్ చూసే వారిపై ఓ కన్నేయడం ద్వారా వారి కదలికలను గుర్తిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా 1090 సేవలను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా ఓ పోలీసు బృందం పోర్న్ చూసే వారిపై నిఘా పెడుతుంది. అటువంటి వారి డేటాను సేకరిస్తుంది. అంతేకాదు, పోర్న్ వీడియోలను అదే పనిగా చూస్తున్న వారికి ఓ మెసేజ్ కూడా వెళ్తుంది. దీంతో తాను పోలీసుల నిఘాలో ఉన్న విషయం యూజర్‌కు అర్థమవుతుంది. పోర్న్ చూసే వారి డేటాబేస్ నేరాల దర్యాప్తు సమయంలో ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇంటర్నెట్ యూజర్లపై నిఘా పెట్టడమే కాకుండా ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం దీనిని రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించనున్నట్టు ఏడీజీ నీరా రావత్ తెలిపారు. మంచి ఫలితాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. అదే పనిగా పోర్న్ చూసే యువకులు మహిళలపై నేరాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.