Chandrababu: ఏకగ్రీవాలు సరికాదు అంటున్న చంద్రబాబు, పవన్ కోర్టులకు వెళ్లచ్చు కదా?: అంబటి రాంబాబు
- ఏకగ్రీవాలపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారు
- ఏకగ్రీవం చేసుకుంటే తప్పెలా అవుతుంది?
- మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలి
పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు తప్పుపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏకగ్రీవాలపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం చేసుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
ఏకగ్రీవాలు తప్పయినప్పుడు గత ప్రభుత్వాలు వాటికి పారితోషికాలు ఎలా ఇచ్చాయని అడిగారు. ఏకగ్రీవాలు సరికాదు అంటున్న చంద్రబాబు, పవన్ తో పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డ కోర్టులకు వెళ్లొచ్చు కదా? అని అన్నారు. ఏకగ్రీవాలు అందరూ స్వాగతించాల్సిన విషయమని... వాటిని వ్యతిరేకించే ధోరణి ప్రజాస్వామ్యంలో శోచనీయమని చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు, పవన్ అర్రులు చాస్తున్నారని దుయ్యబట్టారు.
నిమ్మగడ్డ రమేశ్ రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయడం లేదని అంబటి విమర్శించారు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారని... నిబంధనలకు విరుద్దంగా మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయనపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలలో వెలువడుతున్న ఫలితాలు ముఖ్యమంత్రి జగన్ పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు.