Supreme Court: నియోజకవర్గం వెలుపల ఉండే వ్యక్తుల ఓటు హక్కు వినియోగంపై కేంద్రం, ఈసీలకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court issues notice to Union Government and Election Commission
  • వర్చువల్ ఓటింగ్ సౌకర్యం కోసం సుప్రీంలో పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన కేరళ వాసి కె.సత్యన్
  • విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
  • ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కేంద్రం, ఈసీలకు సూచన
పోలింగ్ సమయానికి నియోజకవర్గం వెలుపల ఉండే వ్యక్తులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్న వ్యక్తులు వర్చువల్ విధానంలో ఓటు వేయడంపై అభిప్రాయాలు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు, వ్యాపారస్తులు సహా నియోజకవర్గం వెలుపల ఎక్కడెక్కడో ఉండే వ్యక్తులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ సూచించింది.

కేరళకు చెందిన కె.సత్యన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈమేరకు స్పష్టం చేసింది. ఆధునిక, సాంకేతిక యుగంలో అందరూ ఓటు హక్కు ఉపయోగించుకునేలా చూడాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఈ-ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఎక్కడ్నించైనా తమ ఓటు వేసేలా వర్చువల్ విధానంతో కూడిన సదుపాయం కల్పించాలని, ఆ మేరకు తమ నియోజకవర్గాలకు వెలుపల ఉండే వలసజీవులు, ఎన్నారైలు, ఉద్యోగులు, విద్యార్థులకు ఓటీపీ ఆధారిత ఓటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఉద్దేశాన్ని మరింత విస్తృతం చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉందని, దీన్ని ఓటు హక్కు ఉన్న అందరికీ వర్తింపజేసేలా చూడాలని విన్నవించారు.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  వాదనలు జరిగే సమయంలో ఆయన స్పందిస్తూ.... "ఇదేం పిటిషన్? మీరు ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాల్లో కూర్చుని ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఓటేస్తారా? మీ నియోజకవర్గానికి వెళ్లాలన్న బాధ్యతలేని మీకు న్యాయవ్యవస్థ ఎందుకు సాయం చేయాలి?" అని ప్రశ్నించారు. అంతేకాదు, ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి తమకు పరిమితులు ఉన్నాయని సీజేఐ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియమ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది కాళీశ్వరమ్ రాజ్ స్పందిస్తూ... వ్యక్తులను వారి ఉద్యోగం, ఉపాధే ప్రధానమా? లేక, ఓటు హక్కు వినియోగించుకోవడమే ప్రధానమా? అనే అంశాల మధ్య ఒత్తిడికి గురిచేయలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఉదాహరించారు. వ్యక్తులు వారి పొట్టకూటి కోసమే బయటి ప్రాంతాలకు వెళతారని, వారికి ఓటు హక్కు దూరం చేయలేరని వాదించారు.

ఉపాధి కోసం లక్షలాది మంది విదేశాలకు వెళుతున్నారని, వారికి ఓటు హక్కు నిరాకరించడం అన్యాయం అని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఇప్పటికే ఉందని, దాన్ని విస్తృతం చేయాల్సిందిగా తాము కోరుతున్నామని వివరణ ఇచ్చారు. ఆ మేరకు వాదనలు విన్న పిమ్మట కేంద్రానికి, ఈసీకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Supreme Court
Union Government
Election Commission
E-Voting
Postal Ballot
India

More Telugu News