Komatireddy Venkat Reddy: టీఆర్ఎస్ పార్టీ హత్యలకు కూడా వెనుకాడడంలేదు... అడ్వొకేట్ దంపతుల హత్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు
- హైకోర్టు అడ్వొకేట్ వామనరావు దంపతుల దారుణ హత్య
- భగ్గుమంటున్న న్యాయవాదులు, రాజకీయనేతలు
- సీబీఐ విచారణ జరపాలన్న కోమటిరెడ్డి
- ప్రశ్నించే గొంతులను అడ్డుతొలగించుకుంటున్నారని వ్యాఖ్యలు
తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణి దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. అటు న్యాయవాద వర్గాలే కాకుండా, రాజకీయపరంగా ఈ జంట హత్యలు కలకలం రేపాయి. ఈ హత్యోదంతంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఓ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈ హత్యలో పాలుపంచుకున్నాడని ఆరోపించారు. ఉదయం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడని, మధ్యాహ్నం అడ్వొకేట్ దంపతుల హత్యాకాండలో పాల్గొన్నాడని, ఇంతకంటే దారుణం ఉందా? అని వ్యాఖ్యానించారు.
ప్రశ్నించే వ్యక్తులను అడ్డుతొలగించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ హత్యలకు కూడా వెనుకాడడంలేదని మండిపడ్డారు. ఈ హత్యల వెనుక ఉన్నది ఎంతటి పెద్దవాళ్లయినా వదిలిపెట్టకూడదని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఘోరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని కోమటిరెడ్డి విమర్శించారు.
అంతకుముందు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హత్యకు గురైన వామనరావు దంపతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర సర్కారుపై ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని అన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే వామనరావు దంపతులను అంతమొందించారని బండి సంజయ్ ఆరోపించారు.
బీజేపీ నేత వివేక్ స్పందిస్తూ, అనేక అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్న వామనరావు దంపతులను హత్య చేయడం దారుణమని అన్నారు.