Sajjala Ramakrishna Reddy: లోకేశ్ టీడీపీని నడిపిస్తాడన్న నమ్మకం లేక చంద్రబాబు నిస్పృహకు గురవుతున్నారు: సజ్జల
- ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు
- కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులకు అధిక విజయాలు
- తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారన్న సజ్జల
- కుప్పం ప్రజలు చంద్రబాబును వెలివేశారని వ్యాఖ్యలు
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకర్గంలో వైసీపీ మద్దతుదారులు సత్తా చాటడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు.
తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారనడానికి ఇప్పటివరకు జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు పూర్తిగా వెలివేశారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. తన జాగీరు అనుకున్న కుప్పంలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, ఈ ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
కుప్పంలో ఎదురైన ఫలితాలతో ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపైనా సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్యం ఓడినట్టా?... వైసీపీ గెలిస్తే అక్రమాలతో గెలిచినట్టా? ఎందుకు గెలవలేకపోయామో దానికి సంజాయిషీ ఇవ్వకుండా గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల వృద్ధుడైన చంద్రబాబును నాయకుడిగా కలిగివున్న టీడీపీ ఇక దుకాణం మూసుకోవడం మేలని సజ్జల హితవు పలికారు.
చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుందని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారని, చంద్రబాబు ఓడినా, గెలిచినా అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడాయనకు వయసు పైబడిందని, కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని లోకేశ్ నడుపుతారన్న నమ్మకం లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర నిస్పృహలో కూరుకుపోయారని వివరించారు. అదే సమయంలో, జగన్ చిన్న వయసులోనే సొంతంగా పార్టీ స్థాపించి అధికారంలోకి రావడాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారని సజ్జల విమర్శించారు.