Bar Council Of India: అడ్వొకేట్ల హత్యలు అరాచకపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి: బార్ కౌన్సిల్

Bar Council Of India responds to advocate couple murders

  • పెద్దపల్లి జిల్లాలో వామనరావు, నాగమణి దంపతుల హత్య
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
  • న్యాయవాదుల స్వేచ్ఛకు తీవ్ర ముప్పు ఉందని వ్యాఖ్య 
  • స్వతంత్ర దర్యాప్తుకు హైకోర్టు సీజేకి లేఖ
  • న్యాయవాది కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి

తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్లు వామనరావు, నాగమణి దంపతుల దారుణ హత్యలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ హత్యలు అరాచకపు రోజులను జ్ఞప్తికి తెస్తున్నాయని బార్ కౌన్సిల్ ఆరోపించింది. తెలంగాణలో పట్టపగలు గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిలను చంపేయడం చూస్తుంటే న్యాయవాదుల స్వేచ్ఛకు ఎంత తీవ్రమైన ముప్పు ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. వృత్తిలో స్వతంత్రతకు ఇది గొడ్డలి పెట్టు వంటి ఘటన అని అభిప్రాయపడింది.

ప్రజల పక్షాన నిలిచే న్యాయవాదులకు కష్టాలే కాదు ప్రాణాపాయం కూడా ఉంటుందన్న సత్యాన్ని ఈ దారుణం చాటుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి హేయమైన ఘటనలను చాలా తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది.

తెలంగాణ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయాలని తీర్మానించినట్టు వెల్లడించింది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరతామని వివరించారు.

అంతేకాకుండా, సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో... హత్యకు గురైన న్యాయవాది కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని, వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

  • Loading...

More Telugu News