KCR: త్వరలోనే డిజిటల్ సర్వే... ఒక్కసారి పూర్తయితే ఎవరూ మార్చలేరు: సీఎం కేసీఆర్
- తెలంగాణలో నూతన రెవెన్యూ విధానం
- ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం
- డిజిటల్ సర్వేతో స్పష్టత వస్తుందన్న సీఎం కేసీఆర్
- ప్రతి భూమికి కో ఆర్డినేట్స్ ఇస్తామని వెల్లడి
- దుర్మార్గాలు ఆగిపోతాయని వివరణ
తెలంగాణలో నూతన రెవెన్యూ విధానం అమలులో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంతకుముందే ప్రకటించామని, సర్వే కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. సర్వే చేసి వ్యవసాయ భూములకు కచ్చితమైన కొలతలు ఇస్తామని తెలిపారు. ప్రతిభూమికి కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని, వాటిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సి ఉందని, కానీ కరోనా వ్యాప్తితో ఆలస్యం అయిందని అన్నారు. ఒక్కసారి సర్వే పూర్తయితే అన్ని రకాల భూముల మధ్య స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై సీఎం ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వంద శాతం విజయవంతమైందని తెలిపారు.
ధరణి రాకతో రెవెన్యూ విభాగంలో అవినీతి అంతమైందని, నోరులేని అమాయక రైతులకు న్యాయం జరిగిందని వివరించారు. ఒకరి భూమిని మరొకరి పేరు మీద రాసే అరాచకాలు, జుట్టుకు జుట్టు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయాలు, డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గాలు ఆగిపోయాయని వివరించారు.