Chittoor District: రేషన్ డెలివరీ వాహనాల్లో ఓటర్లకు శ్రీవారి లడ్డూలు పంచుతున్న సర్పంచ్ అభ్యర్థి
- చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఆసక్తికర ఘటన
- ఎస్సీ, ఎస్టీలకు ఐదు.. ఇతరులకు 10 లడ్డూల పంపకం
- లడ్డూల పంపకంపై స్థానికుల విమర్శలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, వైసీపీలు బలపరిచిన అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. దీంతో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు ఏకంగా శ్రీవారి లడ్డూలను పంచుతున్నాడు. ప్రభుత్వం రేషన్ ను పంపిణీ చేస్తున్న డోర్ డెలివరీ వాహనం ద్వారానే లడ్డూలను కూడా సరఫరా చేస్తున్నాడు. రేషన్ వాహనం నిండా లడ్డూలను నింపిన సదరు అభ్యర్థి ఎస్సీ, ఎస్టీలకు ఐదు లడ్డూల చొప్పున, ఇతర కులాల వారికి పది లడ్డూల చొప్పున పంచుతున్నాడు.
ఈ పంపకాలను చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లడ్డూల పంపకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం దేవుడిని కూడా వాడుకుంటున్నారని పలువురు మండిపడుతున్నారు.