Dr Shyam Prasad: మళ్లీ జగనే సీఎం... ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చెడుపనుల గురించి మాట్లాడడం ఎందుకు?: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ
- కర్నూలు మెడికల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే
- ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్
- అవినీతి లేనిదెక్కడ అంటూ వ్యాఖ్యలు
- ఈసారి జగన్ మరింత ప్రభంజనం సృష్టిస్తాడని వెల్లడి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కర్నూలు వైద్య కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే సందర్భంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వంలో అనేక మంచి పనులు జరుగుతున్నప్పుడు చెడు పనుల గురించి మాట్లాడడం ఎందుకని అన్నారు. మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందని, అవినీతి లేనిదెక్కడ? అని ప్రశ్నించారు.
సీఎం జగన్ అప్పులు తీసుకువచ్చి మరీ సంక్షేమం కోసం పాటుపడుతున్నాడని, మరోసారి ఆయనే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఈసారి మరింత తీవ్రస్థాయిలో ప్రభంజనం ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్య రంగం కోసం గత సర్కారు 2 శాతం నిధులు ఇస్తే, జగన్ 10 శాతం ఇస్తున్నారని, రూ.20 వేల కోట్లు మంజూరు చేశారని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వివరించారు.