Rakhi Sawant: నా భర్తతో పెళ్లి బంధాన్ని తెంచుకుంటా: రాఖీ సావంత్
- బిగ్ బాస్ సీజన్ 14లో సంచలన వ్యాఖ్యలు చేసిన రాఖీ సావంత్
- తన భర్తకు ఇంతకు ముందే పెళ్లయిందన్న రాఖీ
- ఒక మహిళ, చిన్నారి జీవితాలను నాశనం చేయలేనని వ్యాఖ్య
తన కోసం మరో మహిళ, ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేయలేనని బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొంటున్న ఆమె... ఓ టాస్క్ లో భాగంగా ఈ విషయాన్ని తెలిపింది. రితీశ్ అనే ఎన్నారైను రాఖీ పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతనితో వైవాహిక జీవితాన్ని తాను బ్రేక్ చేసుకుంటానని సంచలన ప్రకటన చేసింది. లాస్ట్ విష్ (చివరి కోరిక) టాస్క్ లో భాగంగా రితీశ్ పంపిన లేఖను చించే అవకాశాన్ని బిగ్ బాస్ ఆమెకు ఇచ్చారు. దీంతో, ఆ లేఖను చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అంతేకాదు అతనితో వైవాహిక జీవితానికి కూడా ముగింపు పలుకుతానని సంచలన ప్రకటన చేసింది.
రితీశ్ తో తన పెళ్లి ఒక స్కాం వంటిదని ఈ సందర్భంగా రాఖీ సావంత్ తెలిపింది. తాను అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని చెప్పింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన వెంటనే అతనితో పెళ్లి బంధాన్ని తెంచుకుంటానని తెలిపింది. తన కోసం ఒక మహిళ, ఒక చిన్నారి జీవితాలను నాశనం చేయలేనని చెప్పింది. రితీశ్ తనకు పంపిన లేఖ తనకు అవసరం లేదని వ్యాఖ్యానించింది. భార్యలు పొందే ఏ ఒక్కటీ రితీశ్ తనకు ఇవ్వలేదని చెప్పింది. ఆభరణాలను పొందడం ద్వారా మాత్రమే ఒక భార్య హక్కులు పూర్తి కావని తెలిపింది.
అంతకు ముందు ఎపిసోడ్ లలో కూడా తన భర్త గురించి రాఖీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ వివాహం జరిగిన తర్వాత... ఆయనకు అప్పటికే పెళ్లయిందని, భార్య, ఒక బిడ్డ ఉన్నారనే విషయాన్ని తనకు చెప్పాడని తెలిపింది.