Virat Kohli: ఆ డిప్రెషన్ సమయంలో ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరిగా ఉన్నాననిపించేది: కోహ్లీ
- 2014 ఇంగ్లండ్ పర్యటనలో కుంగుబాటుకు లోనయ్యాను
- క్రికెట్ ఆడటం కూడా మర్చిపోయాను
- డిప్రెషన్ వల్ల ఆటగాళ్ల జీవితాలు నాశనం అవుతాయి
ఎప్పుడూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డిప్రెషన్ కు గురయ్యాడట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే వెల్లడించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన 'నాట్ జస్ట్ క్రికెట్' పాడ్ కాస్ట్ లో కోహ్లీ మాట్లాడుతూ, తన జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన దశ గురించి వివరించారు.
2014లో ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు కుంగుబాటుకు లోనయ్యానని కోహ్లీ చెప్పాడు. ప్రపంచంలో తానొక్కడినే ఒంటరిగా ఉన్నానని అనిపించేదని తెలిపాడు. ఆ సిరీస్ లో ఐదు టెస్లుల్లో కోహ్లీ కేవలం 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే సాధించాడు. దీని గురించి కోహ్లీ మాట్లాడుతూ, ఆ సమయంలో తాను క్రికెట్ ఆడటం కూడా మర్చిపోయానని చెప్పాడు. తన జీవితంలో అండగా నిలిచే వాళ్లు ఎంతో మంది ఉన్నా... ఒంటరిగా అనిపించేదని తెలిపాడు.
తన మనసులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకునే నిపుణుడు లేడని అనిపించేదని చెప్పాడు. అలాంటి సమయాల్లో నిపుణుల అవసరం చాలా ఉంటుందని నిజాయతీగా చెపుతున్నానని అన్నాడు. కొంతమంది అలాంటి అనుభవాలతోనే చాలా కాలం గడుపుతారని.. ఒక్కొక్కసారి క్రికెట్ సీజన్ మొత్తం బాధపడతారని చెప్పారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావడం సామాన్యమైన విషయం కాదని అన్నాడు. డిప్రెషన్ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తుందని చెప్పాడు.