Swathi Mohan: నాసా మార్స్ రోవర్ మిషన్ లో భారత అమెరికన్ మహిళా శాస్త్రవేత్త కీలకపాత్ర

Swathi Mohan who guided NASA Mars Rover mission
  • అంగారకుడిపై ల్యాండైన పర్సెవరెన్స్ రోవర్
  • స్పేస్ క్రాఫ్టు కంట్రోల్ ఆపరేషన్స్ నిర్వహించిన స్వాతి మోహన్
  • గైడెన్స్, నేవిగేషన్స్ సేవలు అందించిన యువ సైంటిస్టు
  • ఏడాది వయసులో తల్లిదండ్రులతో అమెరికా పయనం
  • అక్కడే విద్యాభ్యాసం
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకుడిపైకి ప్రయోగించిన పర్సెవరెన్స్   రోవర్ విజయవంతంగా ల్యాండైంది. కాగా, ఈ కార్యక్రమంలో భారత అమెరికన్ మహిళా శాస్త్రవేత్త స్వాతి మోహన్ కీలకపాత్ర పోషించారు. స్వాతి మోహన్ నాసా మార్స్ రోవర్ కార్యక్రమంలో గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్ ను పర్యవేక్షించారు. పర్సెవరెన్స్     రోవర్ అరుణగ్రహంపై ల్యాండైన క్షణాన స్వాతి హర్షం వ్యక్తం చేశారు.

అంగారకుడి ఉపరితలంపై ఉండే అత్యంత ప్రతికూల పరిస్థితులను తమ రోవర్ అధిగమించిందని ఆమె వెల్లడించారు. మనిషికి కళ్లు, చెవులు ఎంత ముఖ్యమో.... రోవర్ ను మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్టుకు గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్ వ్యవస్థలు అంతే ముఖ్యమని ఆమె వివరించారు.

స్వాతి మోహన్ కు ఏడాది వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా తరలి వెళ్లారు. ఆమె విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. వాషింగ్టన్ డీసీ ఏరియాలోని నార్త్ వర్జీనియాలో పెరిగిన స్వాతి మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఏరోనాటిక్స్/ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్ డీ కూడా చేశారు. నాసాలో చేరిన తర్వాత కాస్సిని మిషన్ (శని గ్రహ యాత్ర)లోనూ తన ప్రతిభ చాటుకున్నారు.

కాగా, స్వాతికి 9 ఏళ్ల వయసున్నప్పుడు టీవీలో స్టార్ ట్రెక్ సిరీస్ చూసి అంతరిక్ష అంశాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకుందట. రోదసిలో అందమైన ప్రాంతాలను ఆవిష్కరించడంలో తాను కూడా భాగమవ్వాలని కోరుకునేదాన్నని పర్సెవరెన్స్    రోవర్ విజయవంతమైన అనంతరం తన మనోభావాలను పంచుకున్నారు.
Swathi Mohan
Perseverance Rover
NASA
USA

More Telugu News