VC Sajjanar: రాష్ట్రంలోనే తొలిసారి.. ట్రాన్స్‌జెండర్లతో సమావేశమైన పోలీస్ కమిషనర్ సజ్జనార్
- సమావేశానికి హాజరైన 150 మంది ట్రాన్స్‌జెండర్లు
- సునీతా కృష్ణన్ అభ్యర్థన మేరకు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డెస్క్
- వారి సమస్యలు పరిష్కరిస్తామని సీపీ హామీ
హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నిన్న సమావేశమయ్యారు. హిజ్రాలతో పోలీస్ కమిషనర్ సమావేశం కావడం తెలంగాణలోనే ఇది తొలిసారి. సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్‌జెండర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డెస్క్ ప్రారంభించారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతాకృష్ణన్ అభ్యర్థ మేరకు ఈ డెస్క్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సునీత్ కృష్ణన్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యల్లో విద్య, ఉపాధి వంటివి ఉన్నాయని అన్నారు. వారికి అద్దెకు ఇళ్లు దొరకడం లేదని, సన్నిహిత భాగస్వాముల వేధింపులు, వీధుల్లో హింస వంటివి వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఈ డెస్క్ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి తమవైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హామీ ఇచ్చారు.